Funnotes Logo
Home Sai Satcharitra Talapatram
Back to All Chapters See My Guestbook Sign My Guestbook

శ్రీ సాయి సత్ చరిత్రము
ఇరువదినాలుగవ అధ్యాయము
Shri Sai Satcharitra - Chapter 24

ఓం
శ్రీ సాయి నాథాయ నమః

శ్రీ

సాయిబాబా

జీవిత చరిత్రము

ఇరువదినాలుగవ అధ్యాయము

బాబా హాస్యము, చమత్కారము, శనగల లీల

1.హేమాడ్ పంతు 2.సుదామ 3.అన్నా చించణీకర్, మావిశీ బాయి - కథలు.

ప్రస్తావన

ఈ అధ్యాయములోగాని, వచ్చే అధ్యాయములోగాని ఫలానిది చెప్పెదమనుట ఒకవిధముగా అహంకారమే. మన సద్గురుని పాదములకు అహంకారమును సమర్పించినగాని, మన ప్రయత్నమందు జయమును పొందము, మన మహంకారరాహితుల మయినచో, మన జయము నిశ్చయము.

సాయిబాబాను పూజించుటచే ఇహపరసౌఖ్యములు రెంటిని పొందవచ్చును. మన మూలప్రకృతియందు పాతుకొని, శాంతిసౌఖ్యములను పొందెదము. కాబట్టి యెవరయితే క్షేమమును కోరెదరో వారు గౌరవాదరములతో సాయిబాబా లీలలను వినవలెను; మననము చేయవలెను. దీనిని నెరవేర్చినచో వారు సులభముగా జీవితపరమావధిని పొందెదరు. తుదకు మోక్షానందమును పొందెదరు.

సాధారణముగా నందరు హాస్యము, చమత్కారభాషణమన్న నిష్టపడెదరు గాని, తాము హాస్యాస్పదులగుట కిష్టపడరు. కాని బాబా చమత్కారము వేరు. అది అభినయముతో కూడినప్పుడు చాల సంతోషదాయకముగ నీతిదాయకముగ నుండెడిది. కావున ప్రజలు తాము వెక్కిరింతలపాలై నప్పటికి అంతగా బాధపడేవారు కారు. హేమాడ్ పంతు తన విషయమునే యీ క్రింద తెలుపుచున్నాడు.

శనగల కథ

షిరిడీలో ఆదివారమునాడు సంత జరిగెడిది. చుట్టుప్రక్కల పల్లెల నుండి ప్రజలు వచ్చి వీధులలో దుకాణములు వేసికొని వారి సరుకులు అమ్ముచుండెడివారు. ప్రతిరోజు మధ్యాహ్నము 12 గంటలకు మసీదు నిండుచుండెను. ముఖ్యముగా ఆదివారమునాడు క్రిక్కిరిసి పోవుచుండెను. ఒక ఆదివారమునాడు హేమాడ్ పంతు సాయిబాబా ముందు కూర్చొని బాబా పాదము లొత్తుచు మనస్సునందు జపము చేయుచుండెను. బాబా యెడమవైపు శ్యామా, కుడివైపు వామనరావు ఉండిరి. శ్రీమాన్ బుట్టీ, కాకాసాహెబ్ దీక్షిత్ మొదలగువారు కూడ నుండిరి. శ్యామా నవ్వుచు అణ్ణా సాహెబుతో “నీ కోటుకు శనగగింజ లంటినట్లున్నవి చూడుము.” అనెను. అట్లనుచు హేమాడ్ పంతు చొక్కాచేతులను తట్టగా శనగగింజలు నేల రాలెను. హేమాడ్ పంతు తన చొక్కా ఎడమ చేతి ముందుభాగమును సాచెను. అందరికి ఆశ్యర్యము కలుగునట్లు కొన్ని శనగగింజలు క్రిందికి దొర్లుట ప్రారంభించెను. అక్కడున్న వారు వానిని ఏరుకొనిరి.

ఈ సంఘటనము హాస్యమునకు తావిచ్చెను. అక్కడున్న వారందరు ఆశ్చర్యపడిరి. ఎవరికి తోచినట్లు వారు శనగలు చొక్కాచేతిలో నెట్లు ప్రవేశించయుండెనో ఊహింపనారంభించిరి. శనగలు చొక్కాలో నెట్లు దూరి యచట నిలువగలిగినవో హేమాడ్ పంతు కూడ గ్రహించ లేకుండెను. ఎవ్వరికిని సరియైన సమాధానము తోచక జవాబు నివ్వనప్పుడు అందరును ఈ యద్భుతమున కాశ్చర్యపడుచుండగా బాబా ఇట్లనియె. “వీనికి (అణ్ణా సాహెబుకు) తానొక్కడే తిను దుర్గుణ మొకటిగలదు. ఈనాడు సంతరోజు శనగలు తినుచు ఇక్కడకు వచ్చినాడు. వాని నైజము నాకు తెలియును. ఈ శనగలే దానికి నిదర్శనము. ఈ విషయములో నేమి యాశ్చర్యమున్నది?”

హేమాడ్ పంతు:- బాబా నేనెప్పుడు ఒంటరిగా తిని యెరుగను. అయితే యీ దుర్గుణమును నాపై నేల మోపెదవు? ఈనాటికి ఎన్నడును షిరిడీలోని సంత నేను చూచి యుండలేదు. ఈ దినము కూడ నేను సంతకు పోలేదు. అట్లయినచో నేను శనగల నెట్లు కొనియుంటిని? నేను కొననప్పుడు నే నెట్లు తినియుందును? నాదగ్గరనున్న వారికి పెట్టకుండనే నెప్పుడేమియు తిని యెరుగను.

బాబా:- అవును అది నిజమే. దగ్గరున్న వారి కిచ్చెదవు. ఎవరును దగ్గర లేనప్పుడు నీవుగాని, నేనుగాని యేమి చేయగలము? కాని నీవు తినుటకు ముందు నన్ను స్మరింతువా? నేనెల్లప్పుడు నీ చెంత లేనా? నీవేదైన తినుటకు ముందు నాకర్పించుచున్నావా?

నీతి

ఈ సంఘటనమున బాబా యేమి చెప్పిరో జాగ్రత్తగా గమనించెదము. పంచేంద్రియములకంటె ముందే, మనస్సు, బుద్ధి విషయానంద మనుభవించును. కనుక మొదలే భగవంతుని స్మరించవలెను. ఇట్లు చేసినచో, నిదికూడ ఒకవిధముగ భగవంతుని కర్పితమగును. విషయములను విడచి పంచేంద్రియము లుండలేవు. కనుక ఆ విషయములను మొదట గురుని కర్పించినచో వానియం దభిమానము సహజముగా ఆదృశ్యమైపోవును. ఇవ్విధముగా కామము, క్రోధము, లోభము మొదలగువాని గూర్చిన వృత్తులన్నిటిని (ఆలోచనలను) మొట్టమొదట గురుని కర్పించవలెను. ఈ ఆభ్యాసము నాచరించినచో దేవుడు వృత్తులన్నియు నిర్మూలనమగుటకు సహాయపడును. విషయముల ననుభవించు ముందు బాబా మనచెంతనే యున్నట్లు భావించినచో, నా వస్తువు ననుభవింపవచ్చునా? లేదా? యను ప్రశ్న యేర్పడును. ఏది యనుభవించుటకు తగదో దానిని విడిచి పెట్టెదము. ఈ విధముగా మన దుర్గుణములన్నియు నిష్క్రమించును. మన శీలము చక్కబడును. గురువు నందు ప్రేమ వృద్ధిపొందును. శుద్ధజ్ఞానము మొలకెత్తును. ఈ జ్ఞానము పృద్ధిపొందినపుడు దేహబుద్ధి నశించి, బుద్ధి చైతన్యఘనమున లీనమగును. అప్పుడే మన కానందము, సంతృప్తి కలుగును. గురువునకు, దేవునకు ఎవరు భేదము నెంచెదరో వారు దైవము నెచ్చటను జూడలేరు. భేద భావము లన్నిటిని ప్రక్కకు త్రోసి, గురువును, దేవుని ఒకటిగా భావించవలెను. ఈ ప్రకారముగా గురుని సేవించినచో భగవంతుడు నిశ్చయముగా ప్రీతిచెందును. మన మనస్సులను స్వచ్ఛము చేసి. ఆత్మసాక్షాత్కారము ప్రసాదించును. క్లుప్తముగా చెప్పునదేమన మనము గురుని స్మరించనిదే యేవస్తువును పంచేంద్రియములతో ననుభవించరాదు. మనస్సును ఈవిధముగా శిక్షించినచో మనమెల్లప్పుడు బాబాను జ్ఞప్తియందుంచుకొనెదము. మనకు బాబా యందు ధ్యాన మెన్నో రెట్లు వృద్ధిపొందును. బాబా సగుణస్వరూపము మన కండ్ల యెదుట నిలుచును. అప్పుడు భక్తి, వైరాగ్యము, మోక్షము మన వశమగును. మన మనస్సునందు బాబాను ఎప్పుడయితే నిలుపగలమో, అప్పుడు మనము ఆకలిని, పిపాసను, సంసారమును మరచెదము. ప్రపంచసుఖములందు గల యభిలాష నశించి మన మనస్సులు శాంతిని, ఆనందమును పొందును.

సుదాముని కథ

పై కథ చెప్పుచున్నప్పుడే హేమాడ్ పంతుకు సుదాముని కథ జ్ఞప్తికి వచ్చెను. అందులోకూడ ఇదేనీతి యున్నది. కనుక దాని నిక్కడ చెప్పుచున్నాము.

శ్రీ కృష్ణుడు, అతని యన్న బలరాముడు, మరియొక సహపాఠి సుదాముడను వాడును గురువగు సాందీపుని యాశ్రమములో నివసించు చుండిరి. శ్రీ కృష్ణబలరాములను అడవికి పోయి కట్టెలు తీసికొని రమ్మని గురువు పంపెను. సాందీపుని భార్య సుదామునికూడ అదే పని మీద ముగ్గురి కొరకు శనగలిచ్చి పంపెను. కృష్ణుడు సుదాముని యడవిలో గలసి యిట్లనెను. “దాదా నాకు నీళ్ళు కావలెను, నాకు దాహము వేయుచున్నది.” సుదాముడు, “ఉత్తకడుపుతో నీరు త్రాగకూడదు, కనుక కొంత తడవాగుట మంచి” దనెను. కాని తనవద్ద శనగలున్నవని, కొంచెము తినుమని యనలేదు. శ్రీ కృష్ణుడు అలసియుండుటచే సుదాముని తొడపయి తలయుంచి గుఱ్ఱుపెట్టుచు నిద్రపోయెను. ఇది కనిపెట్టి సుదాముడు తన జేబులోని శనగలు తీసి తినుట కారంభించెను. హఠాత్తుగ శ్రీకృష్ణు డిట్లనియె, “దాదా! యేమి తినుచుంటివి? ఎక్కడనుంచి యీ శబ్దము వచ్చుచున్నది?”. సుదాము డిట్లనెను, “తినుట కేమున్నది? నేను చలితో వణకుచున్నాను. నా పండ్లు కటకట మనుచున్నవి, విష్ణుసహస్రనామమును గూడ సరిగ ఉచ్ఛరించలేకున్నాను. ”ఇది విని సర్వజ్ఞుడగు శ్రీ కృష్ణుడిట్లనెను. “నేనొక స్వప్నమును గంటిని. అందులో ఒకడింకొకరి వస్తువులను దినుచుండెను. ఏమి తినుచుంటివని యడుగగా ఏమున్నది తినుటకు మన్నా? యనెను. అనగా తినుట కేమియు లేదని భావము. రెండవవాడు ‘తథాస్తు’అనెను. దాదా! యిది యొక స్వప్నము. నా కివ్వకుండ నీవేమి తినవని నాకు తెలియును.” స్వప్నప్రభావముచే నీ వేమితినుచుంటివని యడిగితిని. ” శ్రీకృష్ణుడు సర్వజ్ఞుడనిగాని, అతని లీలలు గాని తెలిసియున్నచో సుదాముడట్లు చేసియుండడు. కాబట్టి అతడు చేసినదానిని తానే యనుభవింపవలసి వచ్చెను. శ్రీ కృష్ణుని ప్రియ స్నేహితు డయినప్పటికి అతని ఉత్తరకాల మంతయు గర్భదారిద్ర్యముచే బాధపడవలసి వచ్చెను. కొన్నాళ్ళకు భార్య కష్టము చేసి సంపాదించిన పిడికెడు అటుకులు సమర్పించగనే శ్రీ కృష్ణుడు సంతసించి ఒక బంగారు పట్టణము ననుభవించుట కిచ్చెను. ఎవరికయితే దగ్గరున్నవారు కియ్యకుండ తిను అలవాటుండునో వారు దీనిని జ్ఞప్తియందుంచుకొన వలెను.

శ్రుతికూడ దీనినే నొక్కి చెప్పుచున్నది. మొదట భగవంతునికి అర్పించి, ఆ భుక్తశేషమునే మనము అనుభవించవలెను. బాబాకూడ దీనినే హాస్యరూపముగా యుక్తితో బోధించెను.

అణ్ణా చించణీకరు, మావిశీబాయి

హేమాడ్ పంతు ఇచట నింకొక హాస్యసంఘటనను అందులో బాబా చేసిన మధ్యవర్తిత్వమును వర్ణించెను. దామోదర్ ఘనశ్యామ్ బాబరె వురఫ్ అణ్నా చించణీకర్ యను భక్తుడొకడు గలడు. అతడు సరళుడు, మోటువాడు, ముక్కుసూటిగా మాట్లాడువాడు, ఎవరిని లక్ష్యపెట్టువాడు కాడు. ఉన్నదున్నట్లు చెప్పేవాడు. ఎప్పటి దప్పుడే తేల్చువాడు. బయటికి కఠినునివలెను, హఠము చేయువానివలెను, గాన్పించినను, వాడు మంచిహృదయము గలవాడు. నక్కజిత్తులవాడు కాడు. అందుచే బాబా వానిని ప్రేమించుచుండెను. అందరు సేవ చేయునట్లే, యితడుకూడ మధ్యాహ్నము బాబా యెడమచేతిని (కఠడా పైన వేసియుండు దానిని) తోముచుండెను. కుడివయిపు ఒక ముసలి వితంతువు వేణుబాయి కౌజల్గి యనునామె యుండెను. ఆమెను బాబా ‘అమ్మా’ యని పిలుచుచుండెను. ఇతరులు మావిశీబాయి యని పిలిచెడి వారు. ఆమెకూడ బాబాను సేవించుచుండెను. ఈమెది స్వచ్చమైన హృదయము. ఆమె బాబా నడుమును మొలను వీపును తన రెండు చేతుల వ్రేళ్ళు అల్లి, దానితో నొక్కుచుండెను. ఆమె దీనిని అతి తీవ్రముగా చేయుచుండెను. బాబా వీపు కడుపు కలిసిపోవునట్లు గాన్పించు చుండెను. ఇంకొక ప్రక్క అణ్ణా తోముచుండెను. మావిశీబాయి ముఖము క్రిందకు మీదకగుచుండెను. ఒకసారి యామె ముఖము అణ్ణా ముఖమునకు చాలదగ్గరగా బోయెను. హాస్యమాడు నైజము గలదగుటచే నామె యిట్లనెను. “ఓహో! యీ అణ్ణా చెడ్డవాడు, నన్ను ముద్దుబెట్టుకొనుటకు యత్నించుచున్నాడు. ఇంత ముసలివాడయినప్పటికి నన్ను ముద్దు పెట్టుకొనుటకు సిగ్గులేదా?” యనెను. అణ్ణాకు కోపము వచ్చెను. చొక్కా చేతులు పై కెత్తి అతడిట్లనెను. “నేను ముసలివాడను దుర్మార్గుడ ననుచున్నావు. నేను వెర్రివాడనా? నీవే కలహమునకు కాలుద్రువ్వుచున్నావు.” అక్కడున్న వారందరు ఈ ముసలి వాండ్రకలహమును జూచి నవ్వుచుండిరి. బాబా యిద్దరిని సమానముగా ప్రేమించువారు కనుక ఇద్దరిని ఓదార్చవలెనని తలచి యీ క్రింది విధముగా నేర్పుతో సమాధానపరచెను. బాబా ప్రేమతో “ఓ అణ్ణా! ఎందు కనవసరముగా గోల చేయుచున్నావు? తల్లిని ముద్దు పెట్టుకొనినచో దానిలో అనౌచిత్యమేమి?” యనెను. బాబా మాటలు విని, యిద్దరు సంతుష్టి చెందిరి. అందరు సరదాగా నవ్విరి. బాబా చమత్కారమునకు హృదయానంద పూరితులైరి.

బాబా నైజము, భక్తపరాయణత్వము

బాబా తన భక్తులను వారి వారి యిష్టానుసారము సేవ చేయుటకు అనుమతించుచుండెను. దీనిలో నితరులు జోక్యము కలుగజేసికొనుట బాబా కిష్టము లేదు. ఒక ఉదాహరణము నిచ్చెదము. ఈ మావిశీబాయియే యింకొకప్పుడు బాబా పొత్తికడుపును తోముచుండెను. ఆమె ప్రయోగించు బలమును జూచి, యితర భక్తులు ఆతురపడిరి. వారిట్లనిరి. “అమ్మా! కొంచెము మెల్లగా తోముము. బాబా కడుపులోని ప్రేవులు, నరములు తెగిపోగలవు”. ఇట్లనగనే, బాబా వెంటనే లేచి కోపముతో సటకాను నేలపై గొట్టెను. వారి కండ్లు నిప్పుకణములవలె ఎర్రనాయెను. బాబాను జూచుట కెవ్వరికి ధైర్యము లేకుండెను. బాబా సటకా చివరను రెండు చేతులతో పట్టుకొని పొత్తికడుపులోనికి గ్రుచ్చుకొనెను. ఇంకొకచివరను స్తంభమునకు నాటించెను. సటకా యంతయు పొత్తికొడుపులో దూరునట్లు కానవచ్చుచుండెను. కొద్ది సేపటిలో పొత్తికడుపు ప్రేలు ననుకొనిరి. బాబా క్రమముగా స్తంభమువైపు పోవుచుండెను. అందరు భయపడిరి. ఆశ్చర్యముతోను, భయముతోను మాట్లాడలేక మూగవాండ్రవలె నిలిచిరి. బాబా తన భక్తురాలి కొరకు ఈ కష్టము అనుభవించిరి. తక్కిన భక్తులు ఆమెను బాబాకు హానిలేకుండ తోముమనిరి. మంచి యుద్దేశముతో వారు ఈ మాటలనిరి. దానికికూడ బాబా యొప్పుకొనలేదు. వారి మంచి యుద్దేశమే బాబాను కష్టములో దించినందుకు వారాశ్చర్యపడిరి. ఏమియు చేయలేక కనిపెట్టుకొని చూచుచుండిరి. అదృష్టముచే బాబా కోపము తగ్గెను. సటకాను విడిచి గద్దెపయి కూర్చుండిరి. అప్పటినుండి భక్తుల యిష్టానుసారము సేవచేయునప్పుడు ఇతరులు జోక్యము కలుగజేసికొనరాదను నీతిని నేర్చుకొనిరి. ఎవరి సేవ యెట్టిదో బాబాకే గుర్తు.

ఓం నమోః శ్రీ సాయినాథాయ
శాంతిః శాంతిః శాంతిః
ఇరువదినాలుగవ అధ్యాయము సంపూర్ణము.

|సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు|
|శుభం భవతు|
V. Rama Aravind.
2009-07-26.
Posted on: 2009-07-31.
Special About this Day: Varalakshmi Vratam.
Chapter last updated on: 2011-11-08.
Top

© 2003 - 2023, Rama Aravind Vorray, Inc. Site Last Updated: 2023-04-08. Contact Me